----భక్తిశ్రద్ధలతో భవానీ దీక్ష చేపట్టి అమ్మవారి దర్శనానికి పయనం

----విజయదశమి నాటికి ఇంద్రకీలాద్రికి చేరుకోనున్న భవానీలు


రావులపాలెం :
దుర్గమ్మ దర్శనానికి కాలినడకన బయలుదేరిన పలువురు భవానీలు మండలం పరిధిలోని ఈతకోట గ్రామానికి చెందిన పలువురు భవానీలు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనార్థం గురువారం నాడు భక్తిశ్రద్ధలతో పాదయాత్రను ప్రారంభించారు.ఈ సందర్భంగా తొలుత ఈతకోట గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొందిన భవానీలు విజయవాడలోని ఇంద్రకీలాద్రికి పాదయాత్రగా బయలుదేరారు.

11 రోజులపాటు నియమనిష్ఠలతో దీక్ష : 
భవానీలు 11 రోజులపాటు కఠిన నియమనిష్ఠలతో భవానీ దీక్షను ఆచరిస్తూ, అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ తమ పాదయాత్రను కొనసాగించనున్నారు. భక్తిభావంతో సాగుతున్న ఈ పాదయాత్రలో భాగంగా విజయదశమి పర్వదినం నాటికి విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధికి చేరుకుని జగన్మాతను దర్శించుకోవాలని భవానీలు సంకల్పించారు.

భవానీలకు ప్రజా సేవకుడు గండ్రోతు దుర్గాసురేష్ అభినందనలు : 
అమ్మవారిపై అపారమైన భక్తివిశ్వాసాలతో భవానీ దీక్ష చేపట్టి పాదయాత్ర ప్రారంభించిన భవానీలకు ఈతకోట గ్రామానికి చెందిన ప్రజాసేవకుడు గండ్రోతు దుర్గాసురేష్ అభినందనలు తెలిపారు.ఆ జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కరుణాకటాక్షాలు భవానీలందరిపై ఎల్లవేళలా ఉండాలని, వారి పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మవారి దర్శనంతో భవానీలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.