---------120 వార్డులకు 1,623 నామినేషన్
---------మేయర్ అభ్యర్థి రేసులో 29 మంది
విశాఖపట్నం :
ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. మొత్తం 120 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ 77 స్థానాల్లో, జనసేన పార్టీ 32 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 11 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. దీంతో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చినట్లయింది.జీవీఎంసీ పరిధిలోని 120 వార్డులకు మొత్తం 1,623 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ తరఫున 493, జనసేన పార్టీ తరఫున 266, భారతీయ జనతా పార్టీ తరఫున 90 నామినేషన్లు నమోదయ్యాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 359 నామినేషన్లు దాఖలు కాగా, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 287 నామినేషన్లు వచ్చాయి. సీట్ల సర్దుబాటు నేపథ్యంలో ఆశించిన స్థానాలు దక్కని నాయకులు, ఆశావహుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా పార్టీల నేతలు అసంతృప్తులను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు కూటమి పార్టీలు అభ్యర్థుల జాబితాలను అధికారికంగా ప్రకటించకుండానే కొందరికి నేరుగా బీ ఫారాలు అందిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై ఆసక్తి నెలకొంది.జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో మేయర్ పదవిపై కూడా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మేయర్ అభ్యర్థి రేసులో 29 మంది ఉన్నట్లు సమాచారం. కూటమి పార్టీల్లో సీట్ల పంపకం పూర్తవడంతో పాటు, అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపులు ఇప్పుడు కీలకంగా మారాయి. ఎన్నికల బరిలో ఎవరు నిలుస్తారు, మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఎవరికి ఉంటుందన్న అంశాలపై విశాఖ రాజకీయాల్లో చర్చ సాగుతోంది.
మొదటి వ్యాఖ్య రాయండి!