( -- మే 21 ఇంటర్నేషనల్ టీ డే సందర్భంగా ప్రత్యేకం )

టీ తాగితే ఆ అనుభూతే వేరబ్బా.. టీ తాగితే మనిషికి ఉత్సాహం.. మనసుకు ఉల్లాసం కలుగుతుంది. అందుకే ప్రపంచంలో టీ ప్రియులు అధికంగా ఉన్నారు. మంచినీళ్ల తర్వాత ఎక్కువగా తాగేది టీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలో ఒక్కరోజు 370 కోట్ల టీ కప్పులు ఖాళీ అవుతున్నాయని అంచనా. ఇండియాలో రోజుకు 120 కోట్ల కప్పుల టీ ఆస్వాదిస్తున్నట్టు కొన్ని సర్వేలలో తేలింది.టీ కి చాలా ఏళ్ల నాటి చరిత్ర ఉంది. చైనాలో ప్రారంభమై భారతదేశంలో విస్తరించింది. ఇది ఒక సంస్కృతి, స్నేహం, ఆరోగ్యానికి ప్రతీక. లక్షలాది మందికి ఉపాధి ఇస్తూ ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా టీ ప్రేమికులు ఆనందంగా జరుపుకునే రోజు ఇంటర్నేషనల్ టీ డే. చాయ్ అంటే చాలా మందికి ఇష్టం. ఉదయం లేచిన వెంటనే..సాయంత్రం రిలాక్స్ అవ్వాలంటే టీ తప్పనిసరిగా ఉండాలి. ఈ ప్రత్యేక రోజున టీ కి ఉన్న ప్రాముఖ్యతను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

టీ చరిత్ర :

టీ కి చాలా ఏళ్ల నాటి చరిత్ర ఉంది. సుమారు క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల ముందు ఆసియాలో టీ మొదలైంది. మొదట్లో ఇది ఒక ఔషధంగా వాడేవారు. ఆ కాలంలో టీ అంటే ఇప్పటిలా కాకుండా మసాలాలు కలిపిన రుచి ఉండేది.తర్వాత చైనా చక్రవర్తి షేన్ సంగ్ టీ ఆకులు ఉపయోగించడంతో ప్రారంభమైంది. అడవిలో తాగునీరు మరగబెడుతుండగా దగ్గరలో ఉన్న చెట్ల నుండి టీ ఆకులు ఆ నీటిలో పడగా మరిగిన ఆ నీరు రుచిగా ఉండటంతో పాటు ఉత్సాహాన్ని కలిగించటంతో అక్కడి నుంచి టీ ప్రపంచానికి పరిచయం అయింది. మొదట్లో ఔషధంగా వాడిన ఈ టీ కాలక్రమంలో అలవాటుగా మారింది. భారతదేశంలో బ్రిటిష్ పాలన కాలంలో టీ సాగు ప్రారంభమైంది. ఆ తర్వాత భారతదేశం.. ప్రపంచంలో పెద్ద టీ ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా మారింది. స్వాతంత్ర్యం తర్వాత కేఫేలు పెరగడంతో టీ తాగే అలవాటు ఇంకా ఎక్కువైంది.టీ ఒక సంస్కృతి, సంప్రదాయం, అనుబంధాలకు ప్రతీక. ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో టీతో ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి. జపాన్‌లో టీ కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవి. ఇంగ్లాండ్‌లో టీ పార్టీలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంగ్లాండ్ చార్లెస్ రాజ్ టీ ని ఎంతో ఇష్టపడే వారట.టీ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుతుంది. అలసట తగ్గిస్తుంది. అలాగే మనుషులను కలుపుతుంది. కుటుంబం, స్నేహితులు కలిసి కూర్చొని టీ తాగడం ఒక మంచి అనుభూతి ఇస్తుంది.

మసాలా టీ, ప్రీమియం టి,అల్లం టీ,ఇరానీ టీ,పుదీనా టీ, గ్రీన్ టీ, ఇలా పరివిధాలుగా దీనిని ఆస్వాదిస్తారు. కమ్మని తేనీరుఎంతోమంది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. లక్షలాది మంది రైతులు, కార్మికులు టీపై ఆధారపడి జీవిస్తున్నారు. టీ వ్యాపారం దేశాల మధ్య వాణిజ్యాన్ని కూడా పెంచుతుంది.మన రోజువారీ జీవితంలో భాగమైన ఈ చిన్న కప్పు టీ ఎంత గొప్పదో తెలియజేసేందుకు మే 21న వరల్డ్ టీ డే ను జరుపుకుంటారు.

భారతదేశంలో టీ సాగు కు ప్రాముఖ్యత :

భారతదేశంలో అస్సాం, డార్జిలింగ్, నీలగిరి ప్రాంతాల్లో ఎక్కువగా తేయాకు పంటను వేస్తారు. దేశంలో 50 శాతానికి పైగా టీ పంట ఒక్క అస్సాం రాష్ట్రంలోనే దిగుబడి అవుతుంది. అస్సాంలో ఎక్కువగా దిగుబడి కాగా డార్జిలింగ్ లో అంతకంటే తక్కువగా దిగుబడి వస్తుంది. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 17% టీ దిగుబడి కాగా కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే టీ పంట దిగుబడి అవుతుంది. సముద్ర నీటిమట్టానికి 1000 నుండి 2000 అడుగుల ఎత్తులో ఉన్న కొండవాలు ప్రాంతాల్లో ఆమ్ల నేలలు టీ పంటకు అనుకూలం. 25 నుండి 30 డిగ్రీల సెంటిగ్రేడ్ల మధ్య ఉష్ణోగ్రత ఉండాలి. అస్సాం బ్రహ్మపుత్ర వ్యాలీలో ఎక్కువగా టీ పంట పండుతుంది. అస్సాంలో అధికంగా 651.8 మిలియన్ కేజీల టీ ఉత్పత్తి రాగా, రెండో స్థానంలో పశ్చిమబెంగాల్లో 0.4% తో 5.30 మిలియన్ కేజీల ఉత్పత్తి జరిగింది. ఇది తక్కువ పరిమాణమే అయినప్పటికీ ప్రీమియం క్వాలిటీ గల ఉత్పత్తి కావడంతో మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ లో టీ పంట పండుతుంది, దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో 23.8 మిలియన్ కేజీల ఉత్పత్తి వచ్చింది. 2025 లో ప్రభుత్వ లెక్కల ప్రకారం టీ దిగుబడి 1,368,980 టన్నులు. సరిగ్గా వర్షాలు పడకపోవడం, పురుగుల మందుల ప్రభావం తో కొంత పంట నష్టం జరిగినా గత ఏడాది కంటే తేయాకు సాగు లో ఐదు శాతం పెరుగుదల నమోదయింది. టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం 2024తో పోలిస్తే 2025లో మూడు శాతం అదనంగా టీ పంట దిగుబడి వచ్చింది. సహజంగా హెక్టార్ కు 1600 నుండి 3వేల కేజీల వరకు దిగుబడి వస్తుంది. దేశంలో 20 మిలియన్ కేజీల టీ ఎగుమతి ఇరాన్, ఇరాక్, చైనా లకు అవుతుంది. స్వతంత్రానంతరం 1947 లోనే భారతదేశంలో టీ బోర్డు ఏర్పాటు కాబడింది.

టీ పంటకు ఆంధ్రప్రదేశ్ లోను అవకాశాలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టీ సాగు కు అవకాశాలు ఉన్నాయి. అరకు కాఫీకి ప్రపంచ గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. కాఫీ తరహాలోనే టీ సాగుకు కూడా ప్రోత్సాహం,సహకారం అందిస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. కాఫీ సాగు జరిగిన చోట టీ పంటకు కూడా సానుకూల పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. తూర్పు కనుమలు, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, అరకు, చింతపల్లి, అనంతగిరి, గూడెం కొత్త వీధి వంటి ప్రాంతాల్లో ఐదు దశాబ్దాలుగా కాఫీ సాగు కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో టీ పంట వేయటానికి కూడా అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా కొంత కొండ ప్రాంతం టీ పంటకు అనుకూలమని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో తక్కువ స్థాయిలో పలుచోట్ల టీ సాగు కొనసాగిస్తున్నారు. అయితే వాణిజ్యం జరిపే స్థాయిలో టీ సాగు జరగటం లేదు. దేశంలో పలుచోట్ల టీ బోర్డుల ఏర్పాటు ను , ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకారాన్ని ప్రభుత్వాలు అందిస్తున్నాయి. ఇదే తరహాలో మన రాష్ట్రంలో కూడా టీ సాగు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సాకాలను ప్రకటించాలి. టీ సాగు కోసం ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి ప్రోత్సాహక పథకాలను అమలు చేయకపోవడం గమనార్హం. మన కాఫీ కి మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఆధునిక సదుపాయాలతో కూడిన ప్రాసెసింగ్ యూనిట్లు లేవనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో కాఫీ పాటు టీ ఆకు సాగు కోసం తగిన ప్రోత్సాహకాలను ప్రకటించడంతోపాటు పంట విస్తరణకు చర్యలు తీసుకోవాలి. కాఫీ తాగే వారి శాతం తక్కువ, టీ తాగేసి వారి శాతం ఎక్కువ. గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా సేవించేది టీ. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ, ఉద్యానవన శాఖ, టీ బోర్డు సమన్వయంతో రాష్ట్రంలో ముఖ్యంగ తూర్పు కనుమల్లో టీ ఆకు సాగుకు కూడ ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది.