--కాగితాలపై సంతకాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి

--వప్పంగి గ్రామంలో 'నల్సా ఆశా' 100 రోజుల కార్యాచరణ సదస్సు

శ్రీకాకుళం, మే 20:
చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల బాలికలు మానసిక వేదనకు గురికావడమే కాకుండా, వారి శారీరక ఎదుగుదల దెబ్బతింటుందని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కదలాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి కె. హరిబాబు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక వప్పంగి గ్రామంలో 'నల్సా ఆశా-2025', 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బాల్య వివాహాల నివారణపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల అటు తల్లికి, ఇటు పుట్టబోయే బిడ్డకు ప్రాణసంకటంగా మారుతుందని హెచ్చరించారు. ఇదే సమయంలో గ్రామీణ మహిళలు, ప్రజలు ఎదుర్కొంటున్న పలు చట్టపరమైన అంశాలపై హరిబాబు దిశానిర్దేశం చేశారు. వివాహ సమయంలో వరకట్న వేధింపుల నుంచి రక్షణకు, ఆస్తిలో హక్కులు పొందేందుకు తగిన పత్రాల ద్వారా చట్టపరమైన రక్షణ పొందవచ్చని వివరించారు. అక్షరాస్యత లేని అమాయక ప్రజల వద్ద ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకుని దళారులు, వడ్డీ వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి అంగీకార పత్రాలపై అయినా సంతకాలు చేసేటప్పుడు నమ్మకమైన వ్యక్తులతో పూర్తిగా చదివించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.గ్రామాల్లో ఎవరికైనా ఉచిత న్యాయ సహాయం కావాల్సి వస్తే జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని, లేదా 15100 టోల్ ఫ్రీ నంబర్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు జి. శ్రీనివాసరావు, ఎ.జె. ఆదిల్ షా, న్యాయవాది జి. ఇందిరా ప్రసాద్, సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.