జూన్ 20 వరకు అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు

ఇంచార్జి కలెక్టర్ ఎస్. సేధు మాధవన్


​విజయనగరం, మే 21:
                      రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర"  మహా యజ్ఞంలో భాగంగా విజయనగరం జిల్లాలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మే 22 నుండి జూన్ 20, 2026 వరకు నాలుగు వారాల పాటు ముమ్మర పారిశుధ్య డ్రైవ్ "ఆపరేషన్ క్లీన్ స్వీప్" నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ డ్రైవ్‌ను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు ఇంచార్జి కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ తెలిపారు. గురువారం తన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

​నాలుగు వారాల కార్యాచరణ ప్రణాళిక  : ​స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 ప్రమాణాల ఆధారంగా ఈ డ్రైవ్‌ను నాలుగు వారాల పాటు నిర్వహించనున్నారు.​మొదటి వారం (మే 22 – మే 28): గత స్వచ్ఛ సర్వేక్షన్‌లో గుర్తించిన రెడ్, ఎల్లో బ్లాక్ స్పాట్ల నిర్మూలన, ప్రధాన రహదారులు, జంక్షన్ల క్లీనింగ్, రోడ్ మార్కింగ్స్ మరియు కర్బ్ పెయింటింగ్స్.
​రెండవ వారం (మే 29 – జూన్ 4): వర్షాకాలానికి ముందే వరద కాలువలు, నాలాల పూడికతీత మరియు ఇరుకైన సందుల లోతైన శుభ్రత. మూడవ వారం (జూన్ 5 – జూన్ 11): నివాస, వాణిజ్య సముదాయాలలో 100% తడి-పొడి చెత్త వర్గీకరణ. బల్క్ వేస్ట్ ఉత్పత్తిదారులుచేత మేనేజ్‌మెంట్ నియమాల అమలు.నాల్గవ వారం (జూన్ 12 – జూన్ 20): అన్ని పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్ల సంపూర్ణ శానిటైజేషన్, చెత్త వేసే సమస్యాత్మక ప్రాంతాల  పూర్తి నిర్మూలన.

​కఠిన చర్యలు - పారదర్శకత: ​నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు: సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలు  ఉల్లంఘించే హోటళ్లు, మార్కెట్లు, కల్యాణ మండపాలపై కఠిన చర్యలు ఉంటాయి. అవసరమైతే నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేసే అధికారాలు కలెక్టర్లకు ఉన్నాయి.

​జియో-ట్యాగింగ్: 'జియోస్టాట్ టీమ్' అనే థర్డ్-పార్టీ ఏజెన్సీ ద్వారా పనులకు ముందు, తర్వాత  ఫోటోలను జియో-ట్యాగ్ చేసి రోజువారీ నివేదికలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు.

​డ్యాష్‌బోర్డ్ పరిశీలన: మున్సిపల్ కమిషనర్లు వార్డుల వారీగా మైక్రో ప్లాన్స్ సిద్ధం చేసి, ప్రతి రోజు రాత్రి 8 గంటల లోపు వివరాలను ఎమ్‌ఐఎస్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలి.

​గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యం: ​ఒకే రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీల్లో ఏకకాలంలో నిర్వహించిన అతిపెద్ద క్లీన్‌లీనెస్ డ్రైవ్‌గా దీనిని నిలిపి, "గిన్నిస్ వరల్డ్ రికార్డ్" సాధించేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, జియోస్టాట్ బృందాలు డాక్యుమెంటేషన్  సిద్ధం చేస్తున్నాయి. ఈ రికార్డులో విజయనగరం జిల్లా ముందుండాలని ఇంచార్జి కలెక్టర్ పిలుపునిచ్చారు. ​ఈ డ్రైవ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన ఉత్తమ మున్సిపాలిటీలకు రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఉంటాయని, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు మరియు ప్రజలందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇంచార్జి కలెక్టర్ కోరారు.