---నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులు!
న్యూ ఢిల్లీ ; కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాల సమాచారం. దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన మరియు మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుల ఆమోదం కోసం ఈ భేటీని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. గత వర్షాకాల సమావేశాల అనంతరం సభను అధికారికంగా 'సత్రావసానం' చేయకపోవడంతో ఈ ప్రత్యేక భేటీ నిర్వహణకు మార్గం సుగమమైంది.
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులను గతంలోనే ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ, నీట్ పేపర్ లీకేజీ వివాదం మరియు సీజేపీ ఆందోళనల కారణంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి రావడం, విపక్షాల నిరసనలతో ఈ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది.రాజ్యాంగ సవరణకు పార్లమెంటులో మూడింట రెండు వంతుల ప్రత్యేక మెజారిటీ (సుమారు 360 స్థానాలు) అవసరం. తృణమూల్ కాంగ్రెస్ నుంచి 20 మంది ఎంపీలు, శివసేన-యూబీటీ నుంచి ఆరుగురు ఎంపీలు అధికార పక్షంలో చేరడంతో కేంద్ర బలం గణనీయంగా పెరిగింది.
ఈ కీలక బిల్లులకు మరింత స్పష్టమైన మెజారిటీ సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం డీఎంకే సహా ఇతర ప్రాంతీయ పార్టీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.మరోవైపు సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా విపక్షాలు నిరసనలు తెలుపుతున్న తరుణంలో, కేంద్రం ఈ ప్రతిష్టాత్మక బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకురావడం తీవ్ర రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
మొదటి వ్యాఖ్య రాయండి!