న్యూ ఢిల్లీ ; ప్రపంచవ్యాప్తంగా పలు ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న వేళ, భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. వీలైనంత త్వరగా ఈ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. బ్యాంకాక్లో జరిగిన ఐఎంఎఫ్-ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల వేదికగా ఆమె మాట్లాడారు.ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అగ్రరాజ్యం అమెరికాతో చర్చలు వేగవంతం చేశామని, ప్రస్తుతం ఇవి చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు.భారత్-అమెరికా ఒప్పందానికి సంబంధించి ప్రాథమిక/తొలి దశ ఇప్పటికే ఖరారైందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తనకు వెల్లడించినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి చట్టపరమైన ముసాయిదా రూపకల్పన జరుగుతోందని, త్వరలోనే సంతకాలు కూడా పూర్తవుతాయని చెప్పారు.
అంతర్జాతీయంగా కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత స్థిరంగా వృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. కొవిడ్ అనంతర కాలంలో గత నాలుగైదేళ్లుగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని పునరుద్ఘాటించారు.సమ్మిళిత అభివృద్ధి విధానాలు, యువత నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు మరియు పక్కా ఆర్థిక క్రమశిక్షణే భారత్ వృద్ధికి ప్రధాన కారణాలని వివరించారు. ప్రజాధనం వినియోగం పట్ల ప్రభుత్వానికి స్పష్టమైన బాధ్యత ఉందని తెలిపారు.
మొదటి వ్యాఖ్య రాయండి!