------ నామినేషన్లు, పోలింగ్‌, కౌంటిగ్‌  వివరాలు 
----రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడి 


అమరావతి ; ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి కొనసాగుతోంది.. ఇప్పటికే మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగియగా.. ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,488 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో 659 జడ్పీటీసీ స్థానాలు, 9,829 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకారం అక్టోబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ప్రకటనలు జారీ చేయనున్నారు. అదే రోజు నుంచి అక్టోబర్ 23 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మూడు రోజుల సమయం కల్పించారు. అక్టోబర్ 24న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అక్టోబర్ 25న అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ అప్పీళ్లను అక్టోబర్ 26న పరిష్కరిస్తారు. అక్టోబర్ 27న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువుగా నిర్ణయించారు. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం అదే రోజు పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. అనంతరం నవంబర్ 3న జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 4న రీపోలింగ్ చేపడతారు. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు.
28 జిల్లాపరిషత్‌ల పరిధిలో ఎన్నికలురాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఎన్నికలకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాపరిషత్‌ల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 663 మండలాలు ఉండగా, అమరావతిలోని నాలుగు మండలాలను మినహాయించి మిగిలిన 659 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు.
అన్ని చోట్ల వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లుఎన్నికల నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు కృష్ణతేజ తెలిపారు. అన్ని చోట్ల వెబ్‌కాస్టింగ్‌ సదుపాయం కల్పించామని, ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను బట్టి జిల్లా కలెక్టర్లు అవసరమైన ఏర్పాట్లు చేశారని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మొత్తంగా, ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కావడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలై, నవంబర్ 3న పోలింగ్‌, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరగనున్నాయి.