సోంపేట, అక్టోబర్ 16 (న్యూస్ వన్ ప్రతినిధి) :  ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల పాత్ర అత్యంత కీలకమైనది. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు ప్రజాధనాన్ని ప్రజా సంక్షేమానికి, గ్రామీణ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాలి. కానీ ప్రజల అవసరాల కోసం కోట్లాది రూపాయలతో నిర్మాణాలు చేపట్టి, వాటిని పూర్తిచేయకుండా మధ్యలోనే వదిలేయడం, ఇప్పటికే నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకురాకపోవడం ప్రజాధనంపై ప్రభుత్వాలకు ఉన్న బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా విమర్శించింది.ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు స్థలాలు కేటాయించి, అనేక ప్రాంతాల్లో భవన నిర్మాణాలు చేపట్టింది. కొన్ని భవనాలు  పూర్తయినప్పటికీ, మిగిలిన పనులు పూర్తిచేయకుండా వదిలేయడంతో అవి నేటికీ నిరుపయోగంగా ఉన్నాయని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సైతం అటువంటి అసంపూర్తి భవనాల నిర్మాణాలను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంపై తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించింది.

ప్రభుత్వాలు మారుతున్నాయి.. పాలకులు మారుతున్నారు.. కానీ ప్రజాధనం వృథా అవుతున్న తీరు మాత్రం మారడం లేదు!

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మాకన్నపురం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని ఇటీవల సందర్శించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ సంఘసేవకురాలు డాక్టర్ సిపాన గుణవతి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ ఎల్ గోవిందరాజులు జిల్లా అధ్యక్షుడుపిట్ట పోలయ్య, జిల్లావర్కింగ్ ప్రెసిడెంట్ మడ్డు సోమశేఖర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు వైశ్య రాజు మురళి, అడ్వైజర్ దాసరి షణ్ముఖరావు, పలాస సబ్ డివిజనల్ కన్వీనర్ బంగారు విశ్వనాథం, మందస మండలం కన్వీనర్ మధుబాబు, సోంపేట మహిళా కన్వీనర్ మద్దిల వేణు పర్యటన బృందంలో ఉన్నారు. ఈ బృందానికి అక్కడి పరిస్థితులు తీవ్ర ఆవేదన కలిగించాయి. ప్రజలకు సేవలు అందించాల్సిన భవనాలు నిరుపయోగంగా ఉండటం పాలకుల అసమర్థతను ఎత్తిచూపుతున్నాయి. భవనాల ప్రాంగణంలో మౌలిక సదుపాయాలు దెబ్బతినడం, నిర్మాణాలకు సంబంధించిన సామగ్రి ధ్వంసమైనట్లు కనిపించడం పట్ల బృందం విచారం వ్యక్తం చేసింది.ప్రజల సౌకర్యార్థం నిర్మించిన భవనాలు ఉపయోగంలోకి రాకపోవడం వల్ల ప్రభుత్వానికి ప్రయోజనం లేకపోవడమే కాకుండా, కాలక్రమేణా భవనాలు శిథిలావస్థకు చేరి ప్రజాధనానికి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

రాజకీయ నాయకులకు గ్రామీణ ప్రాంతాల సమస్యలు కనిపించడం లేదా?
ఈ సందర్భంగా  డాక్టర్  గుణవతి ప్రభుత్వాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రజల పన్నుల రూపంలో ప్రభుత్వానికి చేరే సొమ్ము ప్రజల సంక్షేమం కోసమేనని, ఆ సొమ్ముతో నిర్మించిన భవనాలను నిరుపయోగంగా వదిలేయడం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమేనని ఆమె స్పష్టం చేశారు.ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాధనంతో నిర్మించిన భవనాలను ఎందుకు పూర్తిచేయడం లేదని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో శిధిలమైన ఈ భవనాలు నాయకుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిన నిర్మాణాలను ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.“ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ కక్షలు, పార్టీ ప్రయోజనాలు పక్కనపెట్టి ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణం కావచ్చు.. ప్రజాధనంతో నిర్మించిన ప్రతి భవనం ప్రజలకే ఉపయోగపడాలి. ప్రభుత్వాలు మారాయని ప్రజల సొమ్ముతో నిర్మించిన భవనాలను నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసం?” అని డాక్టర్ గుణవతి ప్రశ్నించారు.

15 వేల గ్రామ సచివాలయాల నిర్మాణంపై పూర్తి వివరాలు వెల్లడించాలి :

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల గ్రామ సచివాలయాలు ఉన్నట్లు అంచనాలు ఉన్న నేపథ్యంలో, వాటి నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం సమగ్ర వివరాలను ప్రజల ముందు ఉంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.ఈ అంశాలపై సమాచారం అందించాలని కోరుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరుపున  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి శుక్రవారం ఈ-మెయిల్ ద్వారా వినతిపత్రం అందించినట్లు డాక్టర్ గుణవతి తెలిపారు.ప్రజాధనంతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా మారితే దానికి బాధ్యత వహించాల్సింది ఎవరు? నిర్మాణాలు పూర్తిచేయకుండా వదిలేసిన గత ప్రభుత్వమా? వాటిని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో జాప్యం చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వమా? లేక పర్యవేక్షణలో విఫలమైన సంబంధిత అధికారులా? అనే అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని సంఘం ప్రశ్నించింది.గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో నిర్మించిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయకపోతే వాటి నిర్మాణం వెనుక ఉన్న లక్ష్యం నెరవేరనట్లేనని డాక్టర్ సీపాన గుణవతి అన్నారు.ప్రజల సంక్షేమమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం కావాలని, రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. మాకన్నపురం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలపై కూడా సమగ్ర సమీక్ష జరపాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందని డాక్టర్ గుణవతి పేర్కొన్నారు.