ఎన్నికల వేళ శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసు ఆంక్షలు..ఈస్ట్ ఏసీపీ లక్ష్మణ మూర్తి.
వార్తలు
PRASAD
ఒక గంట క్రితం
AI సారాంశం
విశాఖ పట్నం, అక్టోబర్ 19. ప్రస్తుతం జరగతున్న జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం తూర్పు సబ్ డివిజ
విశాఖ పట్నం, అక్టోబర్ 19. ప్రస్తుతం జరగతున్న జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం తూర్పు సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగ కుండా కఠిన ఆంక్షలు విధించామని ఈస్ట్ సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 163 కింద పలు నిషేధాజ్ఞలు జారీ చేశామన్నారు. ఇవి అక్టోబర్ 19వ తేదీ సోమవారం అర్ధరాత్రి నుంచి డిసెంబర్ 2వ తేదీ బుధవారం అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఆంక్షల్లో భాగంగా ముందస్తు అనుమతి లేకుండా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడడాన్ని నిషేధించా మన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున బాణసంచా కాల్చడంపైనా నిషేధం విధించా మన్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసు సిబ్బంది, ఆర్మీ, పారామిలటరీ బలగాలు, ఎన్నికల కౌంటింగ్ విధుల్లో ఉన్న సిబ్బందికి ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. మార్కెట్లు, షాపింగ్ ప్రాంతాలు, ఆటస్థలాలు, విద్యాసంస్థలు, బస్స్టేషన్లలో సాధారణ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశారు. ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం కలిగించే ఆయుధాలు, తుపాకులు, మందుగుండు సామగ్రిని బహిరంగంగా తీసుకెళ్లడం లేదా ప్రదర్శించడం నిషేధించా మన్నారు. డ్యూటీలో ఉన్న లా ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందికి మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ఎన్నికల విజయోత్సవ యాత్రలు, ఊరేగింపులు, బహిరంగ సభలపైనా నిషేధం విధించా మన్నారు. అత్యవసర ప్రజా ప్రకటనలు, ముందస్తు అనుమతితో నిర్వహించే మతపరమైన కార్యక్రమాలు మినహా లౌడ్స్పీకర్లు, శబ్ద కాలుష్య పరికరాల వినియోగానికి అనుమతి లేదని తెలిపారు. అధికారుల ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలను ప్రదర్శించడం, అంటించడం లేదా పంపిణీ చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అధికారిక లేదా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను కలిగి ఉన్న వ్యక్తులను ఓట్ల లెక్కింపు ఏజెంట్లుగా నియమించ రాదని స్పష్టం చేశారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 223తో పాటు ఇతర సంబంధిత చట్టాల కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని మహారాణిపేట, టుటౌన్, త్రీటౌన్, ఫోర్త్టౌన్ పోలీస్ స్టేషన్ల సీఐలను, సిబ్బందిని ఆదేశించా మన్నారు.
మొదటి వ్యాఖ్య రాయండి!