మైదుకూరు : స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నికలను రద్దు చేసింది ఎన్నికల కమిషన్.. మైదుకూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నామినేషన్ కేంద్రంలోకి చొరబడి పత్రాలను ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు.
నామినేషన్ కేంద్రంలోకి చొరబడి పత్రాల ధ్వంసంరాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల ప్రకారం, అక్టోబర్ 17, 2026న మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో మైదుకూరు మున్సిపాలిటీ నామినేషన్ కేంద్రంలోకి గుర్తుతెలియని వ్యక్తుల గుంపు అకస్మాత్తుగా ప్రవేశించింది. ఈ సందర్భంగా 19 నామినేషన్ పత్రాలను చించివేసి ధ్వంసం చేసింది. ఈ ఘటనతో ఎన్నికల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో నామినేషన్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తుతో పాటు సీసీటీవీ నిఘా, వీడియో చిత్రీకరణ వంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై మైదుకూరు మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజు మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ 350/2026తో క్రిమినల్ కేసు నమోదు చేశారు.
18 మంది అభ్యర్థులకు నష్టంఈ ఘటనలో మొత్తం 18 మంది అభ్యర్థులకు చెందిన 19 నామినేషన్ పత్రాలు ధ్వంసమయ్యాయి. వీరిలో ఒక అభ్యర్థి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు ఎస్ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఘటన కారణంగా ప్రభావితమైన అభ్యర్థులు తిరిగి నామినేషన్లు దాఖలు చేసేందుకు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు సంబంధిత ఎన్నికల అధికారులు అక్టోబర్ 17వ తేదీతో నోటీసులు జారీ చేశారు. మైదుకూరు మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల కోసం కొత్త నామినేషన్ పత్రాలను అక్టోబర్ 18న మధ్యాహ్నం 3 గంటల్లోపు సమర్పించాలని ఆ నోటీసుల్లో కోరారు. వివిధ సమాచార మార్గాల ద్వారా అభ్యర్థులకు సమాచారం అందించారు. ధ్వంసమైన పత్రాల స్థానంలో కొత్త పత్రాలను సమర్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు, అభ్యర్థులు సురక్షితంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు పోలీసు ఎస్కార్ట్ సదుపాయం కూడా కల్పించారు.
ఒక్క అభ్యర్థి మాత్రమే తిరిగి నామినేషన్ దాఖలుకడప జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రభావితమైన 18 మంది అభ్యర్థులకు తిరిగి నామినేషన్లు దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చినప్పటికీ ఒక్కరు మాత్రమే స్పందించారు. భారతీయ జనతా పార్టీ తరఫున 21వ వార్డుకు చెందిన అభ్యర్థి మచునూరి శ్రీదేవి మాత్రమే తిరిగి నామినేషన్ పత్రాలను సమర్పించారు. మిగిలిన 17 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. ఈ పరిస్థితిని, నామినేషన్ పత్రాల ధ్వంసం ఘటన తీవ్రతను, ప్రభావిత అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులను రాష్ట్ర ఎన్నికల సంఘం సమగ్రంగా పరిశీలించింది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ సమర్పించిన నివేదికతో పాటు అందుబాటులో ఉన్న ఇతర సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది.
తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎన్నికల ప్రక్రియ నిలిపివేతఈ పరిణామాల నేపథ్యంలో మైదుకూరు మున్సిపాలిటీ చైర్పర్సన్, వార్డు సభ్యుల సాధారణ ఎన్నికలకు సంబంధించిన తదుపరి ప్రక్రియలన్నింటినీ తక్షణమే నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-ZA, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం–1965లోని సెక్షన్లు 10-A, 10-Bతో పాటు 2026 ఎన్నికల నిర్వహణ నిబంధనల కింద తనకు ఉన్న అధికారాలను వినియోగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ నిలుపుదల కొనసాగుతుందని స్పష్టం చేసింది. కడప కలెక్టర్ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా మైదుకూరు ఎన్నికలను నిలిపివేశాం. ప్రస్తుతానికి ఎన్నికల ప్రక్రియను ఆపాం అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. నామినేషన్ పత్రాల ధ్వంసం ఘటన నేపథ్యంలో మైదుకూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై అనిశ్చితి నెలకొంది. తదుపరి ఉత్తర్వుల అనంతరం ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు రద్దు : ఎస్ఈసీ
నేరాలు-ఘోరాలు
MUNI SWAMY
3 గంటల క్రితం
AI సారాంశం
మైదుకూరు : స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వైఎస్సార్ కడ
మొదటి వ్యాఖ్య రాయండి!