హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో  ఈడీ పిటిషన్‌ దాఖలు చేసింది. రోజువారీ విచారణ జరిపి వేగంగా తేల్చాలని పిటిషన్‌లో పేర్కొంది. జగన్‌ సహా నిందితులందరినీ వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశించాలని కోరింది. సీబీఐ కోర్టులో 9 ఈడీ ఛార్జిషీట్లు పదేళ్లుగా పెండింగ్‌ ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొంది. సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్లు తేలకపోవడంతో విచారణ ముందుకు వెళ్లడం లేదని తెలిపింది. ఆర్థిక నేరాలను దేశ ఆర్థిక ఆరోగ్యానికే ముప్పుగా పరిగణించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది.  జగన్‌ కేసులు త్వరగా తేల్చాలని గతంలోనూ ఈడీ పిటిషన్‌ దాఖలు చేసినట్లు హైకోర్టు గుర్తించింది. హరిరామజోగయ్య, ఇతరుల పిటిషన్లతో కలిపి ఈడీ పిటిషన్‌ జతచేయాలని ఆదేశించింది. అన్ని పిటిషన్లను కలిపి ఈ నెల 13న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.