– శాంతియుత ఎన్నికలకు పోలీసుల పిలుపు
పెందుర్తి : విశాఖ జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ఎన్నికలపై అవగాహన కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడటం లక్ష్యంలో భాగంగా బుధవరాం ఉదయం పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ పెందుర్తి, నాయుడుతోట, సాయి మాధవ్ నగర్లోని ఓపెన్ గ్రౌండ్లో యువతతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండుగ వంటివని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు సహకరించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలకు, వర్గ విభేదాలకు, రాజకీయ ఘర్షణలకు తావివ్వకుండా సంయమనం పాటించాలని, ఇతరుల ప్రలోభాలకు లోనుకాకుండా చట్టాన్ని గౌరవించాలని యువతకు తెలియజేశారు.సోషల్ మీడియా వేదికగా వచ్చే తప్పుడు వార్తలు, నిరాధార ఆరోపణలు, రెచ్చగొట్టే పోస్టులు మరియు విద్వేషపూరిత సందేశాలను నమ్మవద్దని, వాటిని ఇతరులకు పంపవద్దని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం వల్ల సమాజంలో ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉందని, అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే చర్యలు, ఓటర్లను బెదిరించడం, ప్రలోభపెట్టడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎవరూ పాల్పడరాదని హెచ్చరించారు.యువత సమాజానికి శక్తి, దేశానికి భవిష్యత్తు అని పేర్కొంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని ఇన్స్పెక్టర్ పిలుపునిచ్చారు. తమ ప్రాంతాల్లో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు, గొడవలకు దారితీసే ప్రయత్నాలు లేదా ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ఘటనలు కనిపించినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, సమస్యలను చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని తెలిపారు.“ఎన్నికలు ప్రశాంతంగా జరగడం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు; ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత కూడా. ముఖ్యంగా యువత సంయమనం, ఐక్యత, బాధ్యతాయుత ప్రవర్తనతో ముందుకు వస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది” అని ఇన్స్పెక్టర్ గారు పేర్కొన్నారు.ప్రజలందరూ పోలీసులకు సహకరించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పెందుర్తి పోలీసులు విజ్ఞప్తి చేశారు.
మొదటి వ్యాఖ్య రాయండి!