కర్నూలు జిల్లా :ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, హైడ్రామాకు కేంద్రబిందువుగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష వైసీపీ నేతల హౌస్ అరెస్ట్‌లు, ముందస్తు అరెస్టులు రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కడపలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. వైసీపీ కార్యాలయం వద్ద ముందస్తు చర్యల పేరుతో ఆయనను అరెస్ట్ చేసి, కడప టౌన్ పరిధి దాటించి వల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనతో పాటు కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, పలువురు జడ్పీటీసీలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక కర్నూలు జిల్లాలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెల్దుర్తిలో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమైన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న కారణంతో ఆమెను వెళ్లకుండా అడ్డుకోవడంతో, శ్రీదేవి రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని, శింగనమలలో మాజీ మంత్రి శైలజానాథ్‌ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తాడిమర్రిలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరగడం లేదంటూ కేతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు కాకినాడ జిల్లా తునిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తొండంగిలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. నిన్న తొండంగి ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు అడ్డుకోవడం, రాళ్ల దాడి జరగడంతో రాజా నాలుగు గంటల పాటు బైఠాయించిన విషయం తెలిసిందే. నేడు మరోసారి నామినేషన్లకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు కట్టడి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార, ప్రతిపక్షాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరడంతో స్థానిక ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కింది.
మొదటి వ్యాఖ్య రాయండి!