విజయవాడ, అక్టోబర్ 22: గోదావరి పుష్కరాల సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించి, వినియోగించిన ప్లాస్టిక్ బాటిళ్లను సమర్థవంతంగా సేకరించి రీసైక్లింగ్ చేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ఛైర్మన్ డా. పి. కృష్ణయ్య సూచించారు.

గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, తాగునీటి సరఫరా, పర్యావరణహిత ప్రత్యామ్నాయాల వినియోగంపై రాష్ట్రంలోని ప్రముఖ బేవరేజ్ సంస్థల ప్రతినిధులతో గురువారం విజయవాడలోని ఏపీపీసీబీ ప్రధాన కార్యాలయం నుంచి ఛైర్మన్ డా. పి. కృష్ణయ్య వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు, వివిధ బేవరేజ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై ప్రత్యేక దృష్టి :

గోదావరి పుష్కరాలు కుంభమేళా తరహాలో భారీ స్థాయిలో నిర్వహించనున్న నేపథ్యంలో, పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి తీర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని, ఈ సమయంలో తాగునీరు, పానీయాల సరఫరా ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పేరుకుపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఛైర్మన్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని తగ్గించేందుకు సాధ్యమైన మేరకు పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని సూచించారు. ముఖ్యంగా వృక్షాధారిత పదార్థాలు, పేపర్ వంటి వాటితో రూపొందించిన పర్యావరణహిత సీసాలు, ఇతర ప్రత్యామ్నాయ ప్యాకేజింగ్ విధానాల వినియోగంపై పరిశ్రమలు పరిశీలన చేయాలని కోరారు.

తాగునీరు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు :

పుష్కరాలకు వచ్చే భక్తులకు ప్లాస్టిక్ సీసాలకు బదులు అవసరమైన ప్రాంతాల్లో వాటర్ డిస్పెన్సర్లు ఏర్పాటు చేయడం, పునర్వినియోగానికి అనువైన సీసాలను వినియోగించేలా చర్యలు చేపట్టాలని బేవరేజ్ సంస్థలకు సూచించారు.

పరిశ్రమలు తమ వనరులు, సామర్థ్యానికి అనుగుణంగా పుష్కర ప్రాంతాల్లో తాగునీటి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడం, తాగునీటి సరఫరా కోసం స్థానిక యంత్రాంగంతో సమన్వయం చేసుకోవడం వంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.

ప్లాస్టిక్ బాటిళ్ల సేకరణ, రీసైక్లింగ్‌కు పటిష్టమైన వ్యవస్థ :

పుష్కరాల సమయంలో విక్రయించే లేదా పంపిణీ చేసే ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగం అనంతరం నిర్లక్ష్యంగా పడవేయకుండా, వాటిని సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేసే వ్యవస్థను ముందుగానే సిద్ధం చేసుకోవాలని డా. పి. కృష్ణయ్య సూచించారు.బాటిళ్ల సేకరణ కోసం తగిన కేంద్రాలను ఏర్పాటు చేయడం, వ్యర్థాలను ఇతర చెత్త నుంచి వేరు చేయడం, సేకరించిన బాటిళ్లను అధీకృత రీసైక్లింగ్ సంస్థలకు తరలించడం, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు పర్యవేక్షణ కొనసాగించడం వంటి చర్యలపై దృష్టి సారించాలన్నారు. పుష్కర ప్రాంతాల్లో స్థానిక సంస్థలు, పారిశుధ్య సిబ్బంది, బేవరేజ్ కంపెనీలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కేవలం బాటిళ్లను సేకరించడంతో ముగియకూడదని, వాటిని సరైన విధానంలో రీసైక్లింగ్ చేయించే వరకు బాధ్యతాయుతమైన వ్యవస్థ ఉండాలని ఛైర్మన్ పేర్కొన్నారు.

అలానే పుష్కరాల సందర్భంగా ప్లాస్టిక్ వినియోగం, సేకరణ, రీసైక్లింగ్ వివరాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించడం అవసరమని ఛైర్మన్ స్పష్టం చేశారు. పుష్కరాల కోసం ఎన్ని ప్లాస్టిక్ బాటిళ్లు అమ్ముడయ్యాయి, ఎన్ని ఉచితంగా పంపిణీ అయ్యాయి, వాటిలో ఎన్ని తిరిగి సేకరించబడ్డాయి, ఎంత పరిమాణంలో రీసైక్లింగ్‌కు పంపించారు, ఇంకా ఎంత వ్యర్థం మిగిలిపోయింది అనే వివరాలను నమోదు చేయాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న హిందుస్థాన్ కోకా-కోలా, రిలయన్స్, బిస్లెరీ ఇంటర్నేషనల్, ఆర్టోస్ తదితర సంస్థల ప్రతినిధులు. వాటర్ డిస్పెన్సర్ల ఏర్పాటు, తాగునీరు మరియు పానీయాల సరఫరా, ప్లాస్టిక్ బాటిళ్ల సేకరణ, రీసైక్లింగ్ వంటి అంశాలపై వివిధ ప్రతిపాదనలు చర్చించారు.పుష్కరాల సందర్భంగా తమ సంస్థల ద్వారా చేపట్టనున్న కార్యక్రమాలు, అందించగల సహకారం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు అనుసరించనున్న విధానాలు, పర్యావరణహిత ప్రత్యామ్నాయాల వినియోగంపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలను పదిహేను రోజుల్లోగా సమర్పించాలని ఆయా సంస్థల ప్రతినిధులను ఛైర్మన్ కోరారు.గోదావరి పుష్కరాలను పర్యావరణహితంగా నిర్వహించడంలో ప్రభుత్వ శాఖలతో పాటు పరిశ్రమలు, స్థానిక సంస్థలు, ఇతర భాగస్వాములు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు, గోదావరి నది, పరిసర ప్రాంతాల పరిశుభ్రతను కాపాడటం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఛైర్మన్ డా. పి. కృష్ణయ్య పేర్కొన్నారు.