- భీమిలి జోన్ లో పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను  పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్ , అదనపు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్.

విశాఖపట్నం, అక్టోబర్ 23: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ రెండవ సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ అదనపు కమిషనర్ పిఎం. సత్యవేణితో కలిసి భీమిలి జోన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

భీమిలి జోన్ పరిధిలోని ఐదు వార్డులకు సంబంధించి చేపట్టిన ఎన్నికల ఏర్పాట్లను కమిషనర్ పరిశీలించారు. సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్‌లు, అదే పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, భద్రపరచడం, పోలింగ్ సిబ్బంది విధుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

 భీమిలి జోన్ పరిధిలోని ఐదు వార్డులకు సంబంధించి మొత్తం 78 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల విధుల నిర్వహణ కోసం ఇద్దరు రిటర్నింగ్ అధికారులు, 84 మంది పోలింగ్ అధికారులు (పీఓలు), 84 మంది సహాయ పోలింగ్ అధికారులు (ఏపీఓలు), 263 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని (ఓ పి ఓలు) నియమించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధులు పట్ల నిర్లక్ష్యంగా ఉన్న రిటర్నింగ్ అధికారి వి.సతీష్ రాజుకు షౌకాజ్ నోటీస్ ఇవ్వాలని అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రానట్లయితే సస్పెండ్ చేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు. రిటర్నింగ్ అధికారులు, రూట్ ఆఫీసర్లు, సెక్టార్ ఆఫీసర్లు, పోలీసులు పరస్పర అవగాహనతో విధులు నిర్వహించాలన్నారు. ఆర్వోలు నియమావళి పుస్తకాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని విధుల నిర్వహణ లోపల లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని  ఆదేశించారు.

 ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో హెల్ప్ డెస్క్, రిజిస్ట్రేషన్, పోలింగ్ ఆఫీసర్ల కౌంటర్లు, మైక్రో అబ్జర్వర్, వీడియో గ్రాఫర్ కౌంటర్లు, మైక్ అనౌన్స్మెంట్ వ్యవస్థను, ఫుడ్ కౌంటర్లను , పోలీస్ కౌంటర్లను ఏర్పాటు చేసి లోపాలు లేకుండా నిర్ణీత కాలంలో ఎన్నికల సామాగ్రి సరఫరా చేసే చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ విజయ్ కుమార్ కు కమిషనర్ ఆదేశించారు.

అనంతరం తగరపువలస బంగ్లామెట్ట ప్రాంతంలోని జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఓటర్లు తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని, పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికీ ఓటరు స్లిప్పుల పంపిణీ జరుగుతున్న తీరుపై బూత్ లెవెల్ అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. అర్హులైన ఓటర్లందరికీ సకాలంలో ఓటరు స్లిప్పులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ పర్యటనలో భీమిలి జోన్ జోనల్ కమిషనర్ విజయకుమార్, పర్యవేక్షక ఇంజనీరింగ్ శాంతిరాజు, కార్యనిర్వాహక ఇంజనీర్ వెంకటవాసు, డీసీపీ వెంకటేశ్వరరావు, రిటర్నింగ్ అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు.