---మాజీ మంత్రి జోగి రమేష్‌పై అనుమానం వ్యక్తం చేసిన మేఘన తండ్రి.


ఇబ్రహీంపట్నం : తమకు జరిగిన ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయని జోగి మేఘన తండ్రి ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.          ఈ ఘటనలో వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ హస్తం ఉండి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 15న జోగి రమేష్‌ కోడలు మేఘన, ఆమె తండ్రి కృష్ణ విజయవాడ నుంచి తెలంగాణ రాష్ట్రం కోదాడ వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు వీరి కారును ఢీకొనగా వాహనం కొంత భాగం దెబ్బతింది.  బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని, తమకు ప్రాణహాని ఉన్నందున విచారణ చేయాలని మేఘన తండ్రి కృష్ణ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 16న ఫిర్యాదు చేశారు. దీనిపై ఇబ్రహీంపట్నం పోలీసులు అప్పుడే కేసు నమోదు చేశారు.

ఇప్పటికే మేఘన.. హత్యాయత్నం, వరకట్న వేధింపుల ఆరోపణలతో మామ రమేష్, భర్త రాజీవ్, మరికొందరు కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయడం, వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని ఇబ్రహీంపట్నం పోలీసులకు మూడు నెలల కిందట ఫిర్యాదు చేయగా కేసు నమోదైన సంఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో కారు ప్రమాద ఘటనపై జోగి రమేష్‌ ప్రమేయం ఉండవచ్చని మేఘన తండ్రి పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని కోరారు.