----------వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి


షాద్‌నగర్ : ఎల్-నినో పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో నీటి లభ్యతలో మార్పులు, వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు పంటల ప్రణాళికతో సాగు చేపట్టాలని షాద్‌నగర్ సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) రమాదేవి సూచించారు. భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గించేందుకు యాసంగిలో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కోరారు.ఫరూక్‌నగర్ మండలం బూర్గుల గ్రామంలో గురువారం వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల అధికారులు రైతు పెంబళ్ల శ్రీధర్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి సాగు పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఏ రమాదేవి, మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పంటల సాగు విధానాలను పరిశీలించి రైతుకు పలు సూచనలు చేశారు. రైతు శ్రీధర్ తనకున్న నాలుగున్నర ఎకరాల భూమిలో ఎల్-నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ సూచనల మేరకు వరి సాగుకు బదులుగా రెండున్నర ఎకరాల్లో తుంపర సేద్యం పద్ధతిలో బెండకాయ, టమాట పంటలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన రెండు ఎకరాల్లోనూ తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటలు సాగు చేసేందుకు భూమిని సిద్ధం చేసుకున్నట్లు వివరించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల మార్పు దిశగా రైతు తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఏ రమాదేవి మాట్లాడుతూ రబీ జొన్న, కుసుమ, పెసర, మినుములు, సజ్జలు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు, కూరగాయలు వంటి తక్కువ నీటితో సాగు చేయగల పంటలను రైతులు ఎంపిక చేసుకోవాలని సూచించారు. భూమి స్వభావం, నేల రకం, నీటి లభ్యతతో పాటు మార్కెట్‌లో పంటలకు ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. నీటి పొదుపుతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకుని స్థిరమైన దిగుబడులు సాధించేందుకు సూక్ష్మ సేద్య పద్ధతులను రైతులు విస్తృతంగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. పంటకు అవసరమైన నీటిని మాత్రమే అందించే బిందు సేద్యం, తుంపర సేద్యం వంటి విధానాలను అవలంబించాలని, ఉద్యానవన శాఖ ద్వారా అర్హత మేరకు సబ్సిడీపై లభించే బిందు సేద్య పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పంటల మార్పుతో పాటు నేలలో తేమను సంరక్షించే పద్ధతులు పాటించడం, నీటిని వృథా కాకుండా వినియోగించడం, సాగు ఖర్చులను నియంత్రించడం ద్వారా వాతావరణ ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని రమాదేవి తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకుంటూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని సూచించారు.కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్, ఉద్యానవన అధికారి హిమబిందు, కాటన్ సీపీఓ తిరుమలరావు, ఏఎంసీ కార్యదర్శి వెంకట్ రెడ్డి, సూపర్‌వైజర్ శ్రీశైలం, ఏఈఓ రాంబాబు, హెచ్ఈఓ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.