----మాధవధార జీవీఎంసీ హైస్కూల్ సందర్శనలో జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం, అక్టోబర్ 22: పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. గురువారం మాధవధార జీవీఎంసీ మున్సిపల్ హైస్కూల్‌ను సందర్శించిన ఆయన, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో భోజనం చేసేలా అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. చేతులు కడుక్కునేందుకు ప్రత్యేక వాస్ బేసిన్ పెట్టాలని చెప్పారు. సందర్శనలో భాగంగా విద్యార్థులతో మమేకమై, వారితో కలిసి భోజనం చేశారు. వివిధ విషయాలపై విద్యార్థులతో మాట్లాడారు. విద్యా బోధన, ఇతర వసతుల కల్పనపై ఆరా తీశారు. డీఈవో ఎన్. ప్రేమ్ కుమార్, ఎంఈవో వేణుగోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మొదటి వ్యాఖ్య రాయండి!