ఎచ్చెర్ల  (న్యూస్ వన్ ప్రతినిధి) :  శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రజాస్వామ్యానికి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ఎప్పుడూ అవసరమే అని ఢిల్లీ యూనివర్సిటీ ఫిలాసఫీ ప్రొఫెసర్  పెరికల కేశవ కుమార్ అన్నారు. దేశంలో ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలు అన్నింటికీ అయన ఆలోచన విధానలే ప్రేరణ అని పేర్కొన్నారు. అంబేద్కర్ :ప్రజాస్వామ్యం, సమానత్వం, సామాజిక న్యాయం అన్న అంశం పై డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ లో  బుధవారం ప్రారంభమైన రెండు రోజుల జాతీయ సదస్సులో ప్రొ. కేశవ కుమార్ ప్రధాన వక్త గా పాల్గొన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయంగా జరుగుతున్న ఉద్యమాలకు, అంబేద్కర్ భావ జాలానికి మధ్య గల సంబంధాలను ఆయన వివరించారు. అంబేద్కర్ ప్రవచించిన తాత్విక సిద్ధాంతం తోనే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమవుతుందని ప్రొఫెసర్ కేశవ కుమార్ చెప్పారు. సమాజం లో ఆధిపత్యం, అణచివేత, హక్కుల ఉల్లంఘన కొనసాగినంత కాలం అంబేద్కర్ అవసరం మరింతగా ఉంటుందని అయన అన్నారు.  ముఖ్య అతిథిగా హాజరైన యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్  బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ దేశ విదేశాల్లోని చాలా మందికి అంబేద్కర్ రోల్ మోడల్ గా ఉన్నారని అన్నారు. అయన  సమాజాన్ని విమర్శ నాత్మకంగా విశ్లేషించి సమస్యలకు పరిష్కారం చూపించారని చెప్పారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె. ఆర్. రజని మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని కోరారు. చదువుకు అంబేద్కర్ ఇచ్చిన ప్రాధాన్యతను విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. అడ్డయ్య మాట్లాడుతూ వర్తమానంలో అంబేద్కర్ ఆలోచన సరళి ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరించారు. అంబేద్కర్ స్టడీ కేంద్రం డైరెక్టర్. డాక్టర్ జి. పద్మారావు మాట్లాడుతూ సాధారణ వ్యక్తి నుంచి  మహోన్నత శిఖరాలకు అంబేద్కర్ ఎలా ఎదిగారో వివరించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ పై ప్రత్యేక సావనీర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సిబ్బంది స్టూడెంట్స్ పాల్గొన్నారు.