ముంబయి  :  ఎయిరిండియాకు చెందిన ఓ విమానం నుంచి హైజాక్‌ అలర్ట్‌ రావడం తీవ్ర కలకలం రేపింది. కోల్‌కతా ఎయిర్‌పోర్టు నుంచి ముంబయి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఈ విమానం లో బెదిరింపు నోట్‌ కన్పించింది. విమాన వాష్‌రూమ్‌లో హైజాక్‌ను  సూచిస్తూ ఉన్న సందేశాన్ని గుర్తించిన పైలట్‌ వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు అలర్ట్‌ ఇచ్చారు.అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే టేకాఫ్‌ను నిలిపివేసి.. విమానాన్ని ఐసోలేషన్‌ ప్రాంతానికి తరలించారు. ప్రయాణికులను దించేసి ముమ్మర తనిఖీలు చేపట్టినట్లు కోల్‌కతా ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ విక్రమ్‌ సింఘ్‌ తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ విమానం ఉదయం 10.20 గంటలకు ముంబయికి టేకాఫ్‌ అవ్వాల్సి ఉంది. అయితే, ఆ బెదిరింపు నోట్‌లో ఉదయం 11.10 గంటలకు విమానాన్ని హైజాక్‌ చేస్తామని రాసి ఉన్నట్లు విక్రమ్‌ సింగ్‌ వెల్లడించారు. విమానంలో 105 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఘటనపై పోలీసులు, సెక్యూరిటీ ఏజెన్సీలు దర్యాప్తు చేపట్టాయి. దీనిపై ఎయిరిండియా ఇంకా స్పందించలేదు.