న్యూ ఢిల్లీ ; మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా ఆయన స్పృహతప్పి పడిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొన్ని నిమిషాలపాటు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. భద్రతా సిబ్బంది వెంటనే ఆయన్ను ఇంటికి తీసుకెళ్లారు. అక్కడే వైద్య బృందం చికిత్స అందించారు.
అయితే, పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. హుటాహుటిన అంబులెన్స్‌లో ఎయిమ్స్‌కు తరలించారు. ఆయన్ను ఆసుపత్రిలోని కార్డియో-న్యూరో సెంటర్‌లో చేర్పించారని, ప్రస్తుతం కార్డియాలజీ విభాగం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ధన్‌ఖడ్‌ 2022 ఆగస్టు నుంచి 2025 జులై వరకు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు.